Paris Olympics : Food in Olympics పారిస్ ఒలింపిక్స్లో పప్పు, అన్నం

ఒలింపిక్స్ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్లో ఆ సమస్య ఉండదు.
దిల్లీ: ఒలింపిక్స్ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్లో ఆ సమస్య ఉండదు. అథ్లెట్ల గ్రామంలో మనవాళ్లు ఎంచక్కా.. బాస్మతి బియ్యంతో చేసిన అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ- గోబీ, కోడి కూర, పులుసులను ఆస్వాదించవచ్చు. భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహారం కోసం ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వాహకులకు ఈ మేరకు భోజనాల పట్టిక పంపించామని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ వెల్లడించాడు. ‘‘భారత వంటకాలతో కూడిన మెను ఉండాలనే మన ప్రతిపాదనలకు అంగీకారం లభించింది. పోషకాహార నిపుణుడి సూచనల మేరకే ఇవి రూపొందించాం. మన అథ్లెట్ల విషయంలో ఆహారం అనేది సమస్య అనే చెప్పాలి. ఒలింపిక్స్లో ప్రధాన భోజన శాలలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల వంటకాలు ఉంటాయి. కానీ మనవాళ్ల కోసం దక్షిణాసియా వంటకాలు కావాలని పట్టుబట్టాం’’ అని శివ తెలిపాడు. మరోవైపు డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో అథ్లెట్ల గ్రామంలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్కు దిన్షా చికిత్స అందించాడు. ‘‘ఆ కేంద్రంలో పూర్తి ఔషధాలు, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. దీని ఏర్పాటు కోసం మన దేశం నుంచి చాలా యంత్రాలను అక్కడికి చేరవేశారు’’ అని శివ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా రవాణా, నియమ నిబంధనలు తదితర విషయాల గురించి మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని అతను పేర్కొన్నాడు.