Pakistan Cricket: Pakistani cricketers are given strict training by the army పాక్ క్రికెటర్ల కోసం ఆ దేశ సైన్యం తమ క్యాంప్‌లో ఆటగాళ్లకు కఠిన శిక్షణ ఇస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: కొద్ది రోజులుగా భారీ సిక్సర్లు కొట్టడంలో పాకిస్థాన్ క్రికెటర్లు (Pakistan Cricket) విఫలమవుతున్నారు. దీనిపై ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీ (Pak Army)ని రంగంలోకి దింపింది. కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణ (Millitary Training)కు పంపింది.
ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్నెస్ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్ అజామ్, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
క్రికెటర్లకు సైన్యంతో శిక్షణ ఇప్పిస్తామని ఇటీవల పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నక్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల పీఎస్ఎల్ టోర్నీలో భాగంగా కొన్ని మ్యాచ్‌లను ఆయన వీక్షించగా.. పాక్ ఆటగాళ్లు ఒక్క బంతిని కూడా స్టాండ్స్‌లోకి తరలించలేకపోయారు. దీంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో.. షహీన్ అఫ్రిదిని తప్పించి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి బాబర్ అజామ్‌కు అప్పగించారు. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.