#Sport News

IPL : ABD Comments on RCB : ఆర్సీబీ వరుస వైఫల్యాలపై ఏబీడీ కీలక వ్యాఖ్యలు..

 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. తాజా ఎడిషన్‌ను ఆర్సీబీ మరీ చెత్తగా ఏమీ ఆరంభించలేదని.. అలా అని అంతగొప్పగా ఏమీ రాణించడం లేదని పేర్కొన్నాడు. 

కాగా ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడింది. చెపాక్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

అనంతరం.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి సత్తా చాటింది. కానీ.. ఆ తదుపరి వరుసగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో చిత్తుగా ఓడి విమర్శల పాలైంది. 

ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి తప్ప ఇతర ప్రధాన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడం వల్ల వరుస ఓటములు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్‌ ఆర్సీబీ ఆట తీరుపై యూట్యూబ్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.  

‘‘ఆర్సీబీ ప్రదర్శన మరీ చెత్తగానూ.. అంత గొప్పగానూ లేదు. కనీసం ఇంకో రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే వాళ్లు తిరిగి పుంజుకోగలరు. రేసులో ముందుకు వెళ్లగలరు. కోహ్లి కు ఈ సీజన్‌లో శుభారంభమే లభించింది.

అతడు ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నాను. మిడిల్‌ ఓవర్లలో అతడి అవసరం ఆర్సీబీకి ఎంతగానో ఉంది. మొదటి ఆరు ఓవర్లలో అతడు దంచికొడుతుంటే చూడటం బాగుటుంది.

ఫాఫ్‌ కూడా కాస్త రిస్క్‌ తీసుకోవాల్సిందే. ఏదేమైనా విరాట్‌ 6- 15 ఓవర్ల వరకు క్రీజులో ఉంటేనే ఆర్సీబీ అనుకున్న లక్ష్యాలను సాధించగలదు’’ అని ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా ఆర్సీబీ ‘స్టార్‌’ బ్యాటర్లు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కామెరాన్‌ గ్రీన్‌, రజత్‌ పాటిదార్‌ ఇంత వరకు బ్యాట్‌ ఝులిపించలేకపోయారు. ఇక తదుపరి బెంగళూరు జట్టు శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్‌ వేదికగా ఏప్రిల్‌ 6న ఈ మ్యాచ్‌ జరుగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *