#Sport News

IPL 2024 RR VS DC: నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్‌ పరాగ్‌….!

ఓవరాక్షన్‌ స్టార్‌ అని పేరున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్‌.. గత కొంతకాలంగా ఓవరాక్షన్‌ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో  సక్సెస్‌ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్‌ ఏదైనా రియాన్‌ చెలరేగిపోతున్నాడు.

గతకొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్‌.. తన ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 43 పరుగులతో అలరించిన పరాగ్‌.. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 45 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

పరాగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో రాజస్థాన్‌ ఢిల్లీని మట్టికరిపించింది. మ్యాచ్‌ మొత్తానికి రియాన్‌ మెరుపు ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. మరి ముఖ్యంగా రియాన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో నోర్జే చుక్కలు చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ ఓవర్‌లో రియాన్‌ వరుసగా 4, 4, 6, 4, 6, 1 పరుగులు చేసి 25 పరుగులు పిండుకున్నాడు. రియాన్‌ దెబ్బకు నోర్జేకు నిన్నటి రాత్రి కాళరాత్రిలా మారింది. 

నోర్జేను బహుశా ఏ బ్యాటర్‌ రియాన్‌లా చితబాది ఉండడు. రియాన్‌ ధాటికి నోర్జే 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. రియాన్‌ నోర్జేకు చుక్కలు చూపిస్తున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

ఒకనాడు ఓవరాక్షన్‌ స్టార్‌ అన్న నోళ్లే ఇప్పుడు రియాన్‌ను పొగుడుతున్నాయి. రాజస్థాన్‌ అభిమానులు రియాన్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రియాన్‌ ఓవర్‌నైట్‌ హీరో అయిపోయాడు. రాయల్స్‌ మున్ముందు పరాగ్‌ నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుంది. 

కాగా, డీసీతో మ్యాచ్‌లో రియాన్‌ రెచ్చిపోవడంతో రాయల్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో రియాన్‌తో పాటు అశ్విన్‌ (29; 3 సిక్సర్లు), జురెల్‌ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు.

ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్‌ వార్నర్‌ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (44 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ బౌలర్లు బర్గర్‌ (3-0-29-2), చహల్‌ (3-0-19-2), ఆవేశ్‌ ఖాన్‌ (4-0-29-1) రాణించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *