BCCI: టీమిండియా హెడ్ కోచ్ పదవి.. మోదీ, అమిత్ షా, సచిన్ పేరిట ఫేక్ అప్లికేషన్లు

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ (Head Coach) పదవి కోసం ప్రముఖుల పేర్లతో భారీగా నకిలీ దరఖాస్తులు పోటెత్తాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ (Head Coach) పదవి కోసం ఈ నెల బీసీసీఐ (BCCI) నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీలు ఉన్నాయి. అందుకోసం కొందరు ఆకతాయిలు.. నరేంద్రమోదీ, అమిత్ షా, సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖుల పేర్లను ఉపయోగించారు. వారి పేరిట ఫేక్ అప్లికేషన్లు పంపారు. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల్లో చాలా వరకు మాజీ క్రికెటర్లు, ప్రముఖ నేతల పేర్లతో ఉన్నాయని జాతీయ మీడియా కథనం పేర్కొంది.
బీసీసీఐ ఇప్పుడు వాటిని ఏరివేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే.. కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. మరోసారి భారతీయుడే ఉంటాడా..? విదేశీ కోచ్‌వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందో తెలియాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత తదుపరి కోచ్ గురించి ప్రకటన ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో హెడ్ కోచ్ పదవికి ప్రకటన ఇస్తూ బీసీసీఐ ఒక గూగుల్ ఫామ్‌ను తన వెబ్సైట్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడానికి గడువు నిన్నటితో ముగిసింది.
ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరినాటికి ముగుస్తుంది. జూన్ 1 నుంచి పొట్టి కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ ముగిసే వరకూ అతడే కోచ్‌గా ఉంటాడు. ఆ తర్వాత కొత్త కోచ్ పదవీకాలం జులై 1 నుంచి మొదలై 2027 డిసెంబరు 31 వరకు మూడున్నరేళ్ల పాటు కొనసాగనుంది. అంటే.. కొత్తగా బాధ్యతలు చేపట్టే కోచ్ 2027లో జరిగే తదుపరి వన్డే ప్రపంచకప్ టోర్నీ ముగిసే వరకు ఈ పదవిలో ఉంటారు. ద్రవిడ్ మళ్లీ ఆ పదవిలో కొనసాగాలనుకుంటే.. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని గతంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. అయితే కుటుంబానికి సమయం కేటాయించాలనుకున్న అతడు మళ్లీ దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపలేదు.