Babar Azam: Pakistan Cricketer బాబర్ అజామ్‌కు మళ్లీ పాకిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు బాధ్యతలను మళ్లీ బాబర్ అజామ్‌కు అప్పగిస్తూ ఆ దేశ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్థాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి బాబర్ అజామ్‌ను (Babar Azam) తప్పించిన సంగతి తెలిసిందే. టీ20లకు షహీన్ అఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్‌ను కెప్టెన్లుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో మరోసారి పాక్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు బాబర్ అజామ్‌ను తిరిగి నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు పీసీబీ కీలక ప్రకటన జారీ చేసింది. ‘‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ నుంచి వచ్చిన ఏకగ్రీవ తీర్మానం మేరకు.. బాబర్ అజామ్‌కు మళ్లీ పరిమిత ఓవర్ల జట్టు బాధ్యతలను అప్పగిస్తూ పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ నిర్ణయం తీసుకున్నారు’’ అని వెల్లడించింది.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను పాక్ 1-4 తేడాతో కోల్పోయింది. అప్పుడు పాక్‌ను షహీన్ నడిపించాడు. అతడి సారథ్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని తన అల్లుడు షహీన్‌ను షాహిద్ వెనుకేసుకొచ్చాడు. ఇప్పుడు షహీన్‌ను తప్పించి మళ్లీ బాబర్‌కే జట్టు పగ్గాలను బోర్డు అప్పగించింది. జూన్ 1 నుంచి విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. మరోసారి రోహిత్ – బాబర్ అజామ్ మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది.