BRS : భారాసలోకి నందికంటి శ్రీధర్

భారాసలో అధిష్ఠానమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని, తమకు దిల్లీలో బాసులెవరూ లేరని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ డీసీసీ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బుధవారం తన అనుచరులతో కలిసి భారాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన శ్రీధర్‌కు అక్కడ అన్యాయం జరిగిందని, భారాసలో చేరాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఆయనకు, ఆయనతో పాటు వచ్చిన అనుచరులకు పార్టీలో సముచిత ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారు. నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్థమయిందని, అందుకే భారాసలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. మైనంపల్లి హన్మంతరావును ఓడించి, మల్కాజిగిరిలో భారాస అభ్యర్థిని గెలిపిస్తానన్నారు.