#Andhra Politics #Politics

Chandragiri: వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత

వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తిరుపతి రూరల్‌: వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వగ్రామం తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు, పోలీసులు మోహరించారు. అనంతరం ఆక్రమణలు తొలగించే పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నేత పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గ్రామస్థులకు మద్దతుగా వెళ్లారు. ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంట్లోనే నిర్బంధించారు. పులివర్తి నానిని కూడా గృహ నిర్బంధం చేశారు.

ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న మహిళకు గాయాలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ స్థలాలు కొనుగోలు చేశామని.. అధికారులు వచ్చి వాటిని తొలగించడం తగదన్నారు. ఎమ్మెల్యే బంధువులు భవన నిర్మాణాలు చేపడుతుంటే ఎవరూ అడ్డుచెప్పడం లేదని.. పేదల షెడ్లను మాత్రం తొలగిస్తున్నారని మండిపడ్డారు. 22 ఎకరాలను చెవిరెడ్డి తన అధీనంలో ఉంచుకున్నారని.. మఠం అధికారులు వాటిని వెంటనే స్వాధీన పరచుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *