#Andhra Politics #Politics

ఈ సారి ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తా

‘ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది.

ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. పదేళ్లలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. పదేళ్లలో ‘విజన్‌ విశాఖ’ సాకారమయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం, పీపీపీ విధానం, ప్రైవేటు వ్యక్తులు ఈ విజన్‌ సాకారంలో భాగస్వాములవుతారు’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ‘విజన్‌ విశాఖ’ పేరిట విశాఖ రాడిసన్‌ బ్లూ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘నేను విశాఖ వస్తానని అనగానే భూకబ్జాలకంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. సీఎం విశాఖ రాకూడదనే ఉద్దేశంతో కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందు బినామీల పేర్లతో కొన్న భూముల ధరలు తగ్గుతాయని భయపడుతున్నారు. నాకు స్వార్థ ప్రయోజనాలే ఉంటే కడప గురించి మాట్లాడతా. భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది? ఏంచేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.. ఆర్థికంగా పురోగమిస్తామని ఆలోచించాలి. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కోసం నేను మాత్రమే నిల్చున్నా. ఇందుకోసం ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియాతోనూ పోరాడుతున్నా’ అని జగన్‌ పేర్కొన్నారు. 

అమరావతికి వ్యతిరేకం కాదు

‘అమరావతిని రాజధానిగా చేయడంపై వ్యతిరేకత లేదు. శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిందీ నేనే. అమరావతిలోని 50 వేల ఎకరాల బంజరు భూమిలో కనీస సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చవుతుంది. విశాఖలో కనీస సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయి. మెరుగులు దిద్దితే నగర రూపురేఖలు గణనీయంగా మారతాయి. కార్యనిర్వాహక రాజధాని ఇక్కడికి మారితే దేశం దృష్టిని ఆకర్షించేలా ఐకానిక్‌ సెక్రటేరియట్‌ ఉండాలి. ఐకానిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, అహ్మదాబాద్‌ తరహాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వస్తే విశాఖ స్థాయి ఇంకా పెరుగుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.

పదేళ్లలో వాస్తవ రూపం

‘ఆధునిక సాంకేతికతను బోధించేలా ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ నిర్మించాలి. భోగాపురం విమానాశ్రయం 15 నుంచి 18 నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. దానికి అనుసంధానించేలా ఆరు వరుసలతో బీచ్‌ కారిడార్‌ రోడ్లు నిర్మిస్తాం. మెట్రోరైలు, ఏడాదిలో ప్రారంభమయ్యే మూలపేట పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదానీ డేటా సెంటర్‌ అయిదారేళ్లలో అందుబాటులోకి వస్తుంది. ఆతిథ్య రంగంలో ఒబెరాయ్‌, మైఫెయిర్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రధాని మోదీ తాజాగా ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పదేళ్లలో సాకారమవుతాయి. హైదరాబాద్‌-విశాఖ, విజయవాడ-బెంగళూరుల మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్ల కోసం ప్రధానితో మాట్లాడుతున్నాం. ఎన్ని అవరోధాలున్నా మనం తప్పక విజయం సాధిస్తాం’ అని జగన్‌ పేర్కొన్నారు. 

హైదరాబాద్‌ను కోల్పోయాం

‘ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక చోదకశక్తి హైదరాబాద్‌ను విభజన తర్వాత కోల్పోయాం. ఏపీ వ్యవసాధారిత రాష్ట్రంగా మిగిలింది. ప్రాథమిక రంగమైన వ్యవసాయంతో పోలిస్తే ద్వితీయ, తృతీయ రంగాలైన సేవా, తయారీ రంగాలు శరవేగంగా వృద్ధి చెందాలి. పారిశ్రామికవాడలతోపాటు విశాఖను అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి లభిస్తుంది. రామాయపట్నం పోర్టుకు వచ్చే నెలలో నౌకలు వచ్చే అవకాశముంది’ అని సీఎం పేర్కొన్నారు. అనంతరం ‘విజన్‌ విశాఖ’ పేరిట రూపొందించిన 28 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించి వీడియోను ప్రదర్శించారు. ఇందులోనే ఐకానిక్‌ సెక్రటేరియట్‌ గ్రాఫిక్స్‌ నమూనా ఉంది. జీవీఎంసీ పరిధిలో రూ.1528.92 కోట్లతో నిర్మించనున్న పలు ప్రగతి పనుల శంకుస్థాపనలు చేశారు. తిరుగు ప్రయాణంలో భోగాపురం విమానాశ్రయం పనులను విహంగ వీక్షణం చేశారు.

కోర్సుల నాణ్యత పెంచేలా మార్పులు

రాష్ట్ర చరిత్రలో తొలిసారి విద్యాసంస్థలను, పరిశ్రమలను మిళితం చేస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులకు శిక్షణతోపాటు ఉద్యోగాలిస్తామన్నారు. ఇప్పటికే 158 పరిశ్రమలతో 208 విద్యాసంస్థలు భాగస్వామ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ పైలట్‌ ప్రాజెక్టు ద్వారా 53 వేల మంది శిక్షణ పొందగా, 26 వేల మందికి ఉద్యోగాలొచ్చాయని తెలిపారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, సీడాప్‌, ఎంప్లాయిమెంట్‌ విభాగాల ఆధ్వర్యంలో విశాఖ ‘వీ కన్వెన్షన్‌’ హాల్‌లో ‘భవిత’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి మాట్లాడారు. ‘పరిశ్రమలకు అనుగుణంగా కోర్సుల నాణ్యత పెంచేలా సిలబస్‌లో మార్పులు చేస్తున్నాం. హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలు, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన కోర్సులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేస్తే ఉద్యోగాలొచ్చే అవకాశాలెక్కువ. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లోనూ మార్పులకు శ్రీకారం చుట్టాం. మళ్లీ అధికారంలోకొస్తే ప్రతి నియోజకవర్గంలోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌, జిల్లాకేంద్రాల్లో స్కిల్‌ కాలేజ్‌, ఆపైన స్కిల్‌వర్సిటీ ఏర్పాటుచేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వం, పరిశ్రమల మధ్య ఎంవోయూలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్కిల్‌ లోగో, స్కిల్‌ యూనివర్సిటీ యాప్‌ను ఆవిష్కరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *