#Persons

Palkuriki Somana – పాల్కురికి సోమన్న

పాల్కురికి సోమనాథ(Palkuriki Somanatha) తెలుగు భాషా రచయితలలో ప్రముఖుడు. అతను కన్నడ(Kannada) మరియు సంస్కృత(Sanskrit) భాషలలో నిష్ణాతుడైన రచయిత మరియు ఆ భాషలలో అనేక క్లాసిక్‌లను రాశాడు. అతను 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవ అనుచరుడైన లింగాయత్ మరియు అతని రచనలు ప్రధానంగా ఈ విశ్వాసాన్ని ప్రచారం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఇతడు మంచి గుర్తింపు పొందిన శైవ కవి.

రచనా శైలి

“ఆరూఢ్య గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ఠ రచన మానుగా సర్వ సామాన్యంబుగామి జానుతెనుంగు విశేషము ప్రసన్నతకు’’

– అని సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో చెప్పాడు. ‘నేను రచిస్తున్నది తెలుగు పుస్తకమని తిరస్కరిస్తారో ఏమో, సాక్షాత్తు వేదోపనిషత్తుల సారమంతా తెలుగులోకి తెస్తున్నాను ఆదరించండి’ అని సవినయంగా ప్రార్థించాడు మహాకవి.

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవి నన్నయభట్టే అయినప్పటికీ తొలి తెలుగుకవి పాల్కురికి సోమనాధుడు. నన్నయ వాడిన ఛందస్సులు, భాషావైభవం, ఇతివృత్తం, పద్యశిల్పం అన్నీ సంస్కృతం నుండి స్వీకరించినవే..! పైగా భారతం అనువాద కావ్యం. సోమనాథుడు అట్లాకాదు. తెలుగు ఇతివృత్తాలు, తెలుగు ఛందస్సు, తెలుగు నుడికారం, జాను తెనుగు స్వీకరించి కావ్య రచన చేశాడు. అందుకే సోమనాథుడు తొలి ‘తెలుగు’ కవి.

సాహిత్యంలో తెలుగు భాషా పదాల వాడకం శివకవి యుగంలో పెరిగింది. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించాడు. “రగడ” అనే ఛందోరీతి ఇతనే ప్రారంభించాడు. ఇతడు మొదలుపెట్టిన రగడను “బసవ రగడ” అంటారు. ద్విపద, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా సీసము, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదము, వన మయూరము, చతుర్విధ కందము, త్రిపాస కందము వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు.

సోమనాథుడు సంస్కృతాంధ్ర భాషా విశారదుడే కాక ప్రాకృత తమిళ కన్నడ మహారాష్ట్రాది బహుభాషా కోవిదుడు. ద్వైతాద్వైత, విశిష్టాద్వైత, బౌద్ధజైనాది సమస్త దర్శనముల సారమును గ్రహించినవాడు. ఇంతటి పండితకవి మొత్తము తెలుగు భాషలోనే మరొకడు లేడంటే అందులో ఆశ్చర్యం లేదు. అంతేకాక ఇతడు సమస్త కవితా సంప్రదాయములూ తెలిసినవాడు. దేశకాల పాత్రములను గుర్తెరిగినవాడు. ప్రజల భాషలో ప్రజల కొరకు ప్రజల ఇతివృత్తాన్ని ప్రచారం చేయవలసిన అవసరం గ్రహించినవాడు. అందుకే నన్నయ్య మనకు అక్షరభిక్షను పెట్టిన ఆదికవి. అయితే పాల్కురికి తొలి తెలుగు కవి. ఐహికాధ్యాత్మికానుసంధానం గావించిన మొట్టమొదటి ప్రజాకవి.

‘‘ఉరుతర గద్య పద్యోక్తులకంటె సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట గూర్చెద ద్విపదలు కోర్కి దైవార’’

– అని బసవ పురాణ అవతారికలో సోమనాథుడు చెప్పుకున్నాడు. ‘జాను తెలుగు’ అనే భాషను తెలుగులో ప్రవేశపెట్టినవాడు పాల్కురికి. ఈ విషయంలో తిక్కనకు పాల్కురికియే గురువు.

నన్నయ పంచమ వేదాన్ని తెలుగులోకి తెచ్చి మహోపకారం చేశాడు. అయితే నన్నయది మార్గ కవిత. నాటి బౌద్ధ జైనములు దేశి కవితను ఆశ్రయించాయి. ప్రజల భాషను స్వీకరించాయి. అందువల పాల్కురికి ద్విపదను, జాను తెనుగును స్వీకరించవలసి వచ్చింది. అంటే నన్నయ్య నాటికి సంస్కృత కవిత మార్గ కవిత. భారతం దేశికవిత-పాల్కురికి నాటికి నన్నయ్య భారతం మార్గ కవిత బసవపురాణం దేశికవిత అయింది. ఇలా రెండువందల సంవత్సరాలలోనే కవితా నిర్వచనాలు మారాయి.

నేడు ఇంగ్లీషుకు ఉన్నట్లే నాడు సంస్కృతానికి మాత్రమే సభాగౌరవం, రాజపోషణ ఉండేది. ధర్మశాస్త్రాదులు, మంత్ర తంత్రాదులు కేవలం సంస్కృతంలోనే ఉండేవి. తెలుగును ఆ స్థాయికి తీసుకురావడం కోసం సోమనాధుడు అవిరళ ప్రయత్నం చేశారు. తత్ఫలితమే బసవపురాణ పండితారాధ్య చరిత్రల రచనమూ జరిగింది.

‘‘తెలుగు మాటల సంగవలదు వేదముల కొలదియు కాసూడు డిలనెట్టులనిన బాటి తూమునకును బాటి నేని బాటింప సోలయ బాటియకాదె’’

– అన్నాడు బసవపురాణంలో. ఇందులో ఇచ్చిన కొలమానపు ఉదాహరణ నూటికి నూరు పాళ్లు తెలుగుదనంతో కూడివుంది. అదే పాల్కురికి విశేషం. అలంకారాలలోనూ పదబంధంతో చమత్కారాలలోనూ పలుకుబళ్లలోనూ పూర్తిగా తెలుగును ఆశ్రయించాడు పాల్కురికి. ఇలా అనేకంటే తెలుగును బ్రతికించాడు పాల్కురికి అనడం ఇంకా బాగుంటుంది. నేటికీ నిఘంటువుల కెక్కని పదాలు వ్యావహారికమైన నుడికారాలు బసవపురాణంలో పండితారాధ్య చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. పాల్కురికి కవిత్రయంలో స్థానమివ్వక భీష్మించి తిరస్కరించిన బహుజనపల్లివంటి పెద్దలు, తిరస్కారంలో శీలాన్ని వ్యర్థం చేయక పాల్కురికి పదాలను నుడికారాలను ప్రజలకు వివరించి ఆయన రచనలు సేకరించి పూర్తిగా చదివి, రసజ్ఞులకు వివరిస్తే భాషకు చాలా ఉపకారం జరిగి వుండేది. ఒక్కమాటలో చెప్పాలంటే పాల్కురికి అన్నమయ్యకు భాషాగురువు. పదరచనకు ప్రోత్సాహకుడు.

‘‘అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయు కాదె కవి వివేకంబు’’

– ఈ వాక్యాలు తిక్కన సోమయాజివి అనుకొంటున్నారేమో, పాల్కురికి సోమనాథునివి. బసవపురాణంలోనివి. అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయడమనే కవితా సిద్ధాంతమును పాల్కురికి ప్రతిపాదించాడు. తిక్కనగారు దానిని విరాటపర్వ అవతారికలో ఆమోదించారు

కళారూపాలు

ప్రధాన వ్యాసం: పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు

మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కూరికి సోమనాథుడు, కాకతీయ యుగం లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణంలొను, పండితారాధ్య చరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.

సోమనాథ స్మృతివనం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పాలకుర్తి గ్రామంలో సోమనాథ స్మృతివనం నిర్మించబడుతోంది. ఇక్కడ సోమనాథుడి 11 అడుగుల భారీ విగ్రహం, సోమనాథుడి మ్యూజియం, థియేటర్‌, స్మృతివనం, లైబ్రరీ, కల్యాణమండపం, గార్డెనింగ్‌తోపాటు ప్రధాన రోడ్లకు అనుసంధానంగా కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *