Will They Send A Junior Lawyer Who Lacks Experience To Ask For A Delay? – అనుభవం లేని జూనియర్ లాయర్‌ని పంపిస్తారా?

కేసు వాయిదా కోరడానికి తన స్థానంలో జూనియర్ న్యాయవాదిని పంపిన ‘అడ్వొకేట్ ఆన్ రికార్డ్’పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 వేలు జరిమానా కట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో కక్షిదారుల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి, వారి తరఫున కేసులు దాఖలు చేయడానికి అధికారం ఉన్న వకీలును ‘అడ్వొకేట్ ఆన్ రికార్డ్’ అంటారు. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన ఓ కేసులో జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. ప్రధాన న్యాయవాది అందుబాటులో లేరని.. అందుకే తాను వచ్చానని.. కేసును వాయిదా వేయాలని ఆయన కోరారు. దీనికి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరు మమ్మల్ని ఇంత తేలికగా తీసుకోలేరు. న్యాయస్థానం నిర్వహణలో మౌలిక సదుపాయాల ఖర్చులు కూడా ఉంటాయి. మీరు వాదన చేయండి’’ అని పేర్కొంది. కేసు వివరాలు తనకు తెలియవని.. ఈ అంశంపై వాదనలు చేయాలని తనకు ఎలాంటి సూచనలూ లేవని జూనియర్ న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ‘‘అడ్వొకేట్ ఆన్ రికార్డ్‌ను పిలవండి. మా ముందు హాజరుకమ్మని ఆదేశించండి’’ అని తెలిపింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వొకేట్ ఆన్ రికార్డ్ హాజరయ్యారు. ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు. ఏ పత్రాలు లేకుండా.. కేసుకు సంబంధించిన పరిజ్ఞానం లేకుండా జూనియర్ న్యాయవాదిని ఎందుకు పంపారని ఆయన్ను న్యాయమూర్తులు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.