West Bengal – సీనియర్ మంత్రి నివాసంపై సీబీఐ దాడులు

పశ్చిమబెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీం, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రల గృహాల్లో ఆదివారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పౌర సంస్థల్లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రిగా, కోల్‌కతా మేయర్‌గా హకీం వ్యవహరిస్తున్నారు. పార్టీలో ప్రముఖనేతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు హకీం ఇంట్లోకి ప్రవేశించిన సీబీఐ అధికారులు సాయంత్రం 6.30 వరకూ ఆయన్ను ప్రశ్నించారు. ఉద్యోగ నియామక వ్యవహారంలో అవకతవకలపై ఆయన్ను ప్రశ్నించి, కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. సీబీఐ దాడుల నేపథ్యంలో మంత్రి మద్దతుదారులు కొందరు ఆయన ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. తనను ఎంతగా వేధించినప్పటికీ భాజపా ముందు మోకరిల్లేది లేదని హకీం ప్రకటించారు. మరోపక్క మాజీ మంత్రి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కమార్‌హటి ఎమ్మెల్యే మిత్రకు చెందిన భవానీపుర్ ప్రాంతంలో గల గృహంలోనూ సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. సాయంత్రం 5 గంటల వరకూ ఆయన విచారణ కొనసాగింది. వీరితో పాటు మరికొందరు టీఎంసీ నేతల ఇళ్లపైనా సీబీఐ బృందాలు దాడులు నిర్వహించాయి.