Vande Bharat : కాషాయ రంగులో

ఇటీవల కేరళలో ప్రారంభమైన వందేభారత్ (Vande Bharat) రైలుకు కాషాయ రంగు ఉండటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఆ రంగును ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ ఆలోచన ఉన్నట్టు చెప్పారు. ‘మనుషుల కళ్లకు రెండు వర్ణాలు బాగా కన్పిస్తాయి. ఒకటి పసుపు కాగా.. రెండోది ఆరెంజ్ రంగు. యూరప్‌లో దాదాపు 80 శాతం రైళ్లపై ఆరెంజ్ లేదా పసుపు, ఆరెంజ్ రంగులు కలగలిసి ఉంటాయి’ అని వివరించారు.
వెండి వంటి చాలా రంగులు బాగా కన్పించినప్పటికీ మనుషుల కంటికి ఆరెంజ్, పసుపు మాత్రమే ఇంకా స్పష్టంగా కనబడతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ రంగు ఎంపిక వెనుక తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టంచేశారు. నూటికి నూరుశాతం శాస్త్రీయ ఆలోచన మాత్రమే ఉందని తెలిపారు. ఓడలు, విమానాల్లో వినియోగించే బ్లాక్ బాక్స్‌లు సైతం ఆరెంజ్ రంగులోనే ఉంటాయని ఆయన గుర్తు చేశారు. జాతీయ విపత్తు స్పందన దళం కూడా ఆ వర్ణంలో ఉండే జాకెట్లనే వినియోగిస్తుందని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలు సహా పలుచోట్ల 9 వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. వాటిలో కాషాయరంగులద్దిన రైలు కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగిస్తోంది. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌కు కాషాయ రంగు పులిమిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో రైల్వే మంత్రి పైవిధంగా వివరణ ఇచ్చారు.