Vande Bharat Express sleeper train will be available next year – వచ్చే ఏడాది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ (Vande Bharat sleeper) రైలు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. 2024 మార్చిలోనే దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో పాటు వందే మెట్రో (Vande Metro) రైలును సైతం వచ్చే ఏడాదే తీసుకురానున్నట్లు పేర్కొన్నాయి.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను తీసుకొస్తామని రైల్వే శాఖ (Indian Railway) ఇది వరకే తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తొలి వందే భారత్ స్లీపర్ కోచ్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు. 2024 మార్చి నాటికి ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు.
తక్కువ దూరాల కోసం ఉద్దేశించిన వందే మెట్రో రైలును సైతం 2024 జనవరిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మాల్యా తెలిపారు. ఇది 12 కోచ్‌లతో రానుందని చెప్పారు. ఇవి నాన్ ఏసీ కోచ్‌లు. తక్కువ టికెట్ ధరకు ప్రయాణ సౌకర్యాన్ని అందించే ఉద్దేశంతో వీటిని తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్నీ సీటింగ్ కోచ్‌లే ఉన్నాయి. అయితే రాత్రి పూట ప్రయాణాలకు ఇవి అనువుగా ఉండడం లేదు. దీంతో వీటి స్థానంలో వందే స్లీపర్ తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. భవిష్యత్‌లో రాజధాని రైళ్లను ఇవి భర్తీ చేయనున్నాయి.