#National News

Union Cabinet approved the Women’s Reservation Bill.. – చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు (Womens Reservation Bill) కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అయితే కాసేపటి తర్వాత ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సదరు ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. 

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *