The Women’s Reservation Bill has received massive support in the Rajya Sabha – మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది

పార్టీలకు అతీతంగా సభ్యులంతా స్పందించారు. సుమారు 11 గంటలపాటు చర్చ జరిగిన తర్వాత గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలికినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓటింగ్ నిర్వహించారు. బిల్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు ఓటింగ్ అనంతరం సభాపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ఆ తర్వాత సభను ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు. లోక్‌సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభలో ఓటింగ్ సమయంలో ప్రధాని సభలోనే ఉన్నారు. బిల్లు ఆమోదం పట్ల ఆయన సంతోషంగా కనిపించారు. చర్చలో కొంత మంది ప్రతిపక్ష సభ్యులు ‘ఇది ఎన్నికల గిమ్మిక్కు’ అని అభివర్ణించినా చివరకు ఓటింగ్‌లో మద్దతుగా నిలిచారు. అయితే జన గణన, డీలిమిటేషన్లను త్వరగా పూర్తి చేసి రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తేవాలని డిమాండు చేశారు.
లోక్‌సభలో బుధవారం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల 128వ రాజ్యాంగ సవరణ బిల్లును గురువారం కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత తొమ్మిదేళ్లుగా మహిళల సాధికారత కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదొకటని ఆయన తెలిపారు. బిల్లులో హారిజంటల్‌గా, వర్టికల్‌గా రిజర్వేషన్లు ఉంటాయని, ఎస్సీ, ఎస్టీల కోటా 33 శాతానికి అనుగుణంగా ఉంటుందని చెప్పారు. డీలిమిటేషన్ కమిషన్ మహిళలకు దక్కే సీట్లపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో ఇక తదుపరి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టంగా మారితే 2024 ఎన్నికల తర్వాత జన గణన, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమల్లోకి రానుంది. 2029 తర్వాతే అమల్లోకి రానుందని బుధవారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికల్లా నియోజకవర్గాల సంఖ్యను పెంచుతారా.. ఉన్న వాటిలోనే కోటా అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బిల్లులోని క్లాజ్ 5పై అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ కసరత్తు పూర్తయ్యేంత వరకూ బిల్లు అమల్లోకి రాదని చెప్పడం విచారకరమన్నారు. దీనిని ఎన్నికల జుమ్లా చేయొద్దని సూచించారు. ఈ బిల్లులో ఓబీసీ మహిళలకూ రిజర్వేషన్లను పొందుపరచాలని కోరారు.