The Plane Crashed Sideways While Landing In Mumbai In Heavy Rain – భారీ వర్షంలో ముంబైలో ల్యాండ్ అవుతుండగా పక్కకి ఒరిగి ప్రమాదానికి గురైన విమానం

నగరంలోని ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా.. అది రన్‌వే నుంచి జారి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే 27పై ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో విమానంలో మొత్తం ఎనిమిది మంది(ఇద్దరు సిబ్బందిసహా) ఉన్నారని సమాచారం. వాళ్లలో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. అయితే వాళ్లకు ఏ తీవ్రత మేర గాయాలు అయిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ప్రమాదానికి గురైన విమానం.. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ వీఎస్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన లియర్‌జెట్45 విమానంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి విమానం ముంబైకి చేరుకున్న క్రమంలోనే ప్రమాదానికి గురైనట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. కెనడాకు చెందిన బాంబార్డియర్ ఏవియేషన్ సంస్థ తొమ్మిది సీట్ల కెపాసిటీ ఉన్న లియర్‌జెట్ విమానాలను ఉత్పత్తి చేస్తోంది.