India – భారత్‌లో తొలి C-295 విమానం ల్యాండ్

భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తొలి సి-295 రవాణా విమానం గుజరాత్ వడోదరలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. బహ్రెయిన్ నుంచి గ్రూప్ కెప్టెన్ పీఎస్ నేగి దీన్ని నడుపుకొని వచ్చారు. దక్షిణ స్పెయిన్ నగరం సెవిల్లే నుంచి ఈ నెల 15న బయలుదేరిన ఈ విమానం ఈజిప్టు, మాల్టా, బెహ్రెయిన్‌లో ఆగి.. బుధవారం వడోదరలోని ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. ఈ నెల 13న భారత వైమానిక దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ తొలి సి-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అందుకున్నారు. హిందన్ వైమానిక స్థావరంలో ఈ నెల 25న జరగనున్న కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఈ విమానం అధికారికంగా భారత వైమానిక దళంలోకి చేరనుంది. మొత్తం 56 సి-295 విమానాలు ఐఏఎఫ్‌లోకి ప్రవేశించనున్నాయని.. వాటిల్లో తొలి 16 స్పెయిన్‌లోనూ, తర్వాతి 40 విమానాలు టాటా-ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ ద్వారా దేశీయంగా తయారవుతాయని అధికారులు తెలిపారు. 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన సి-295 విమానం 71 ట్రూపులను లేదా 50 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు. పెద్ద పెద్ద విమానాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఇది సైనిక ఉపకరణాలను మోసుకెళ్తుంది. రెండేళ్ల క్రితం భారత వైమానిక దళం, ఎయిర్‌బస్ మధ్య రూ.21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఎయిర్‌బస్ 2025 చివరి నాటికి 16 సి-295 విమానాలను అప్పగించనుంది. మరో 40 విమానాలను భారత్‌లో..టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారు చేసి.. అసెంబుల్ చేస్తుంది. వాయుసేనకు చెందిన అవ్రో విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు.