Prime Minister, says Kovind – మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం దేశం సురక్షితం

ప్రధానమంత్రిగా మోదీ ఉన్నంతకాలం నిస్సందేహంగా దేశం భద్రంగా ఉంటుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. మోదీ జీవితం, ఆయన అందించిన సేవలపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా బుధవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కోవింద్ ప్రసంగించి.. ప్రశంసలు కురిపించారు. అసాధారణ వ్యక్తిత్వం, గొప్ప మనసున్న నేతగా ఆయన్ని అభివర్ణించారు. ‘‘పెట్టుబడులు, మేకిన్ ఇండియా కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఊతంగా నిలుస్తున్నాయి. జన్‌ధన్, ఆధార్, మొబైల్.. ఈ త్రయం ద్వారా వ్యవస్థ మునుపెన్నడూ లేనంత విప్లవాత్మక మార్పుల్ని చూసింది. యూపీఐ వ్యవస్థ, దాని ఆధారంగా క్షేత్రస్థాయిలో చెల్లింపులు పెనుమార్పును తీసుకువచ్చాయి. రోడ్డుపక్కన కొబ్బరి బొండాలు అమ్మేవ్యక్తి కూడా యూపీఐని వాడడాన్ని కొన్నేళ్ల క్రితం వరకు ఊహించలేనిది. మోదీ విధానాలు, చేపట్టిన కార్యక్రమాలు ఊహకైనా అందనివి. సాధారణంగా ఒకవ్యక్తికి ఒకటో, రెండో, మహాఅయితే మూడు రంగాల్లో నైపుణ్యం ఉంటుంది. ప్రధాని మోదీ మాత్రం బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయనొక దార్శనిక నేత. రాజనీతిజ్ఞుడు కూడా. మనదేశ వృద్ధి ప్రస్థానానికి ఆయన చోదకశక్తి. ఒక పౌరుడిగా ఈ క్రతువులో భాగస్వామిని కావడం నాకెంతో గౌరవం’’ అని కోవింద్ పేర్కొన్నారు.