Suspension – ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచిన ఎస్.ఐ.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచిన ఎస్.ఐ. సోమనాథ్.. ఉన్నతాధికారులు తనపై తీసుకొన్న క్రమశిక్షణ చర్యతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్ మానే ధ్రువీకరించారు. మహారాష్ట్రలోని పింప్రీ – ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేటులో పనిచేసే సోమనాథ్ అక్టోబరు 10న విధుల్లో ఉండి.. ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నారని తెలిపారు. ఆయనపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు. మూడు నెలలుగా సోమనాథ్ డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఉన్నతాధికారుల చర్యతో ఆ ఆనందం ఆవిరైంది