Supreme Court – ఈడీ అధికారాలపై మా తీర్పును అవసరమైతే పునఃసమీక్షిస్తాం

హవాలా కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అరెస్టులకు, ఆస్తుల అటాచ్‌మెంటుకు ఈడీకి అధికారాలు ఉంటాయంటూ 2022లో తాము ఇచ్చిన తీర్పును అవసరమైతే పునఃసమీక్షిస్తామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని ప్రత్యేక ధర్మాసనం దీనిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించిన పలు అంశాలను త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే పరిష్కరించినట్లు పేర్కొంది. ఇందులో ఎక్కడైనా పునరాలోచన అవసరమా అన్నదే ఇపుడు ముఖ్యమైన అంశమని జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బేలా ఎం.త్రివేది సభ్యులుగా గల ప్రత్యేక ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పునఃపరిశీలన అవసరం లేదంటూ పేర్కొన్న అభిప్రాయాలను న్యాయమూర్తులు రికార్డు చేశారు. ఈడీ పరిమితులకు సంబంధించి త్రిసభ్య ధర్మాసనం గతేడాది జులై 27న ఇచ్చిన తీర్పు పునఃపరిశీలన కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను ప్రత్యేక ధర్మాసనం విచారిస్తోంది. పిటిషనర్ల వాదనలు కూడా విన్నాక దీనిపై ఓ నిర్ణయం తీసుకొంటామని న్యాయమూర్తులు తెలిపారు.