#National News

Supreme Court : సీఎం బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు ఇవ్వొచ్చా?

ముఖ్యమంత్రి దగ్గరి బంధువులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టొచ్చా? ఒకవేళ అలాచేస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి? అని సుప్రీం కోర్టు కాగ్‌ అభిప్రాయాన్ని కోరింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కేసులో జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ కాగ్‌ను రెండు అంశాలపై అభిప్రాయం కోరింది.

1. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అధినేత బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు కట్టబెట్టొచ్చా?

2. ఒకవేళ ఇవ్వొచ్చని చెబితే, అలాంటి వ్యక్తులకు కాంట్రాక్ట్‌లు అప్పగించేటప్పుడు ఎలాంటి నియమనిబంధనలు పాటించాలి? అని అడిగింది.

అరుణాచల్‌ ప్రభుత్వం ఎలాంటి టెండర్లు లేకుండా సీఎం సన్నిహితులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడాన్ని సవాల్‌ చేస్తూ అరుణాచల్‌ సేన అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసులో సుప్రీం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరు దాఖలు చేసిన పిల్‌ను 2007లో గువాహటి హైకోర్టు కొట్టేయడంతో 2010లో దాన్ని సుప్రీంలో సవాల్‌ చేశారు. కాగ్‌ను అడిగిన ప్రశ్నలు రెండూ ఊహాజనితంగా ఉన్నాయని ఆ రాష్ట్ర  సీఎం పెమాఖండూ తరఫు సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ దత్తా, వికాస్‌సింగ్‌లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు ఆ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఊహాజనితం అనుకుంటే అనుకోండి కానీ ఈ రెండు అంశాలపై మేం కాగ్‌ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *