Some Prisoners Are Receiving “Excessive Benefits” – కొంతమంది ఖైదీలు “అధిక ప్రయోజనాలు” పొందుతున్నారు

కొంతమంది దోషులకు ‘ఎక్కువ ప్రయోజనాలు’ ఉంటుంటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తుల హత్యలో దోషులుగా ఉన్నవారిని ఖైదు నుంచి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. దోషుల్లో ఒకరైన రమేశ్ రూపాభాయ్ చందానా తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హాజరయ్యారు. యావజ్జీవ శిక్ష పడినవారిలో పరివర్తన, పునరావాసం కోసం క్షమాభిక్ష ప్రసాదించడమనేది అంతర్జాతీయంగా అమల్లో ఉన్నదేనని, హేయమైన నేరం దృష్ట్యా అలా చేయడం కుదరదని బిల్కిస్‌బానో తదితరులు వాదించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి నిర్ణయం వెలువడినందువల్ల ఇప్పుడు దానిని రద్దు చేయలేమని చెప్పారు. ‘క్షమాభిక్ష విధానం గురించి మాకు తెలుసు. అది అందరూ ఆమోదించినదే. ఇక్కడ బాధితురాలు, ఇతరులు ప్రస్తుత కేసుకు దీనిని వర్తింపజేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసుల్లో వెలువడిన తీర్పులను న్యాయస్థానానికి సమర్పించడంలో సహకరించండి’ అని లూథ్రాకు ధర్మాసనం సూచించింది. సాధారణంగానైతే రాష్ట్రాలు క్షమాభిక్ష ప్రసాదించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ కేసులు దాఖలవుతుంటాయని తెలిపింది. కొందరు దోషులు ఇలాంటి ప్రయోజనాలు ఎక్కువగా పొందుతుంటారని పేర్కొంది. చట్టం, విధానం అందరికీ ఒకటేనని లూథ్రా చెప్పారు. చేసిన నేరం హేయమైనదనే విషయంపై వాదనల్ని న్యాయ విచారణ సమయంలో చేయవచ్చని, ప్రస్తుత దశలో.. అదీ దోషులు 15 ఏళ్లుగా జైల్లో ఉన్న తర్వాత- ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే వీల్లేదని స్పష్టంచేశారు. తదుపరి విచారణ ఈ నెల 20న జరగనుంది.