#National News

Sikkim – కుదిపేసిన తీస్తా నది ఆకస్మిక వరదల ప్రభావం

ఈశాన్య రాష్ట్రం సిక్కింను కుదిపేసిన తీస్తా నది ఆకస్మిక వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇపుడిపుడే తేరుకొంటున్నారు. ఆదివారం నాటికి గుర్తించిన మృతుల సంఖ్య 32కు చేరగా, ఇంకా 122 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరి కోసం ప్రత్యేక రాడార్లు, డ్రోన్లు, ఆర్మీ జాగిలాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గుర్తించిన మృతుల్లో 9 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. రాష్ట్రానికి జీవరేఖ లాంటి జాతీయ రహదారి-10 దారుణంగా దెబ్బతిని నిరుపయోగంగా మారింది. తీస్తా నది వెంబడి 13 వంతెనలు కూలిపోయాయి. రంగ్‌పో నుంచి సింగ్తమ్‌ మధ్య రహదారి మరమ్మతు, విస్తరణ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌కు తూర్పు సిక్కిం జిల్లా మీదుగా ప్రత్యామ్నాయ రహదారులను తెరిచారు. రోడ్లు తెగిపోయిన ఉత్తర సిక్కింలో నలుగురు మహిళలు సహా 56 మందిని కాపాడినట్లు ఐటీబీపీ దళాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 30 సహాయక శిబిరాల్లో 6,875 మంది తల దాచుకొంటున్నారు. వరదల్లో 1,320 ఇళ్లు కొట్టుకుపోయాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *