Sikkim Floods – తీస్తా నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు

తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది. సిక్కింతోపాటు ఇటు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కింలో ఏర్పాటుచేసిన సైనిక శిబిరాలు ఆకస్మిక వరదలకు కొట్టుకుపోవడంతో సైన్యానికి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీస్తా నదిలో బెంగాల్ దిశగా కొట్టుకువస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జలపాయీగుడీ జిల్లాలో ఇలా కొట్టుకొచ్చిన మోర్టార్ షెల్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నదిలో కొట్టుకువచ్చే అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడీ, కూచ్ బిహార్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సైన్యం కూడా అప్రమత్తమై ఆయుధాలను గుర్తించేందుకు నదీతీరం వెంట ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. సిక్కిం వరదల్లో ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. వీరిలో ఏడుగురు సైనికులు ఉన్నట్లు సమాచారం. గల్లంతై ఇంకా ఆచూకీ తెలియని 142 మంది కోసం మూడోరోజైన శుక్రవారం ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు కొనసాగింది. తక్షణ సహాయం కింద సిక్కింకు రూ.44.8 కోట్ల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. నష్టం అంచనాకు త్వరలో కేంద్ర బృందాన్ని సిక్కింకు పంపనున్నట్లు వెల్లడించారు.