Saroja Vaidyanathan a renowned Bharatanatyam artist is no more – ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి సరోజా వైద్యనాథన్ ఇక లేరు

ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు, ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కార గ్రహీత సరోజా వైద్యనాథన్(86) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె గురువారం తెల్లవారుజామున దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భరతనాట్యంతోపాటు కర్ణాటక సంగీతానికి ఆమె ఎనలేని సేవలు అందించారు. భారతీయ పురాణాలు, సామాజిక అంశాలతోపాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కవితల ఆధారంగా సరోజా వైద్యనాథన్ సుమారు 2 వేల నృత్యరూపకాలు ప్రదర్శించి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దిల్లీలో గణేశ నాట్యాలయాన్ని స్థాపించి ఎంతోమందిని నాట్యకారిణులుగా తీర్చిదిద్దారు. ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2002లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. సరోజా వైద్యనాథన్ మృతి పట్ల కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.