#National News

Ram Setu : పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది

తమిళనాడు ఆగ్నేయ తీరం-శ్రీలంక వాయవ్య తీరం మధ్య సముద్రంలో విస్తరించిన ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతోపాటు ఆ ప్రాంతంలో ఇరువైపులా గోడ నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని పేర్కొంటూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. హిందూ పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు, న్యాయవాది అశోక్‌ పాండే ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇప్పటికే భాజపా నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్‌ పెండింగ్‌లో ఉందని గుర్తుచేసిన ఆయన.. ఆ పిటిషన్‌తో దీన్ని కూడా జత చేయాలని కోరారు. తాజా పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. ‘గోడ నిర్మించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుంది. పాలనాపరమైన వ్యవహారాన్ని మేమెందుకు చూడాలి’ అని ప్రశ్నించింది. జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని దాఖలైన పిల్‌తో దీన్ని జత చేయాలని పిటిషనర్‌ కోరినప్పటికీ.. అందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *