Project Cheetah – ప్రాజెక్ట్ చిరుత

‘ప్రాజెక్టు చీతా (Project Cheetah)’లో భాగంగా భారత్‌లోకి చీతా (Cheetah)లు అడుగుపెట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో వదిలిపెట్టారు. అయితే, ఇప్పటివరకు వాటిలో ఆరు చీతాలు, మూడు కూనలు ఆయా కారణాలతో మృత్యువాత పడ్డాయి. వాటి వరుస మరణాలపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ ప్రాజెక్టు విషయంలో అనేక విజయాలు సాధించినట్లు ప్రాజెక్టు హెడ్, పర్యావరణశాఖలో అటవీ విభాగం అదనపు డీజీ ఎస్పీ యాదవ్ చెప్పారు. ముఖ్యంగా చీతాలు సహజ వేట ప్రవర్తనను విజయవంతంగా అలవర్చుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇక రెండో ఏడాదిలో చీతాల సంతానోత్పత్తిపై ప్రధానంగా దృష్టిసారిస్తామని ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆఫ్రికా నిపుణులూ ఊహించలేదు..
‘నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన చీతాల్లో కొన్నింటి శరీరాల్లో అనూహ్య మార్పులు కనిపించాయి. అవి దట్టమైన బొచ్చు (Winter Coat)ను పెంచుకున్నాయి. ఆఫ్రికాలో జూన్- సెప్టెంబరు మధ్య శీతాకాలంలో అవి ఇలా చేస్తాయి. భారత్‌లోనూ అదే జరిగింది. కానీ, ఇక్కడ ఆ సమయం వేసవి, వర్షాకాలం. ఆఫ్రికా నిపుణులు కూడా ఇది ఊహించలేదు. ఈ ప్రాజెక్టు మొదటి సంవత్సరంలో మేం ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఇది ఒకటి. వింటర్ కోట్‌కు తోడు ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలు, తేమ కలగలిసి వాటిలో దురదకు దారితీశాయి. దీంతో అవి తమ శరీరాలను నేలపై, చెట్లకు రాసుకోవడంతో.. గాయాలపాలై, ఇన్ఫెక్షన్ బారినపడ్డాయి. మూడు చీతాలు ఇలాగే మృత్యువాతపడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇకపై తీసుకొచ్చే చీతాల్లో వింటర్ కోట్ లక్షణాలు కనబర్చని వాటిని ఎంపిక చేస్తాం’ అని ఎస్పీ యాదవ్ తెలిపారు.
రేడియో కాలర్ల ద్వారా చీతాలకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాలేదని ప్రాజెక్టు చీఫ్ స్పష్టం చేశారు. ఇప్పటికే వాటిని తొలగించినట్లు, కొత్తవాటితో భర్తీ చేనున్నట్లు చెప్పారు. తర్వాతి బ్యాచ్ చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొస్తామని వెల్లడించారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రవేశపెడతామన్నారు. ‘కునో పార్కుకు 20 చీతాల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక కూన సహా 15 చీతాలు ఉన్నాయి. ఇకపై తీసుకురానున్న చీతాల కోసం మధ్యప్రదేశ్‌లో రెండు ప్రదేశాలను సిద్ధం చేస్తున్నాం. ఒకటి గాంధీసాగర్, మరొకటి నౌరదేహి. గాంధీసాగర్‌లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబరు తర్వాత అక్కడ చీతాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని వివరించారు. భారత్‌లో పుట్టిన కూనలు ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడగలవని, ఈ నేపథ్యంలో రెండో ఏడాది చీతాల సంతానోత్పత్తిపై దృష్టి సారిస్తామన్నారు.