Prime Minister – ఇజ్రాయెల్ సంక్షోభం వేళ మోదీ వ్యాఖ్యలు..

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని.. మానవ అవసరాలు తీర్చే విధానాలతో కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (P20) ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. అంతర్జాతీయ విశ్వాసానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండు దశాబ్దాల క్రితం (2001లో) భారత పార్లమెంటుపై జరిగిన దాడిని ప్రధాని మోదీ ప్రస్తావించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న భారత్.. వేల మంది అమాయక పౌరుల ప్రాణాలను కోల్పోయిందన్నారు. ఉగ్రవాదం అనేది ఎంత పెద్ద సవాల్ అనే విషయాన్ని ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోందన్నారు. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, అది మానవాళికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. యావత్ ప్రపంచం ఉగ్రవాదంతో అతలాకుతలమైనప్పటికీ, దాని ఏకరూప నిర్వచనంపై మాత్రం ఇప్పటికీ ఒప్పందం జరగలేకపోవడం శోచనీయమన్నారు.
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ఘర్షణలు, వివాదాలతో ఎవ్వరికీ ప్రయోజనం ఉండదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మానవాళి ముందున్న సవాళ్లకు విభజన ప్రపంచం పరిష్కారం చూపదన్నారు. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య జరుగుతోన్న భీకర యుద్ధం వేళ ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.