PMO – ‘నకిలీ అధికారి’ కేసు..

ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో తానో ఉన్నతాధికారినని పేర్కొంటూ సెటిల్‌మెంట్ వ్యవహారానికి (PMO imposter case) దిగిన మోసగాడు మయాంక్ తివారీ (Maayank Tiwari) కేసులో సీబీఐ (CBI) దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తాజాగా తివారీకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ కేసులో తివారీని ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు.
‘డాక్టర్ అగర్వాల్’ అనే కంటి ఆసుపత్రితో ఇందౌర్ (Indore)కు చెందిన ఓ ఆసుపత్రి గతంలో ఒప్పందం చేసుకుంది. అయితే, ఒప్పందం నిబంధనలను ఇందౌర్ ఆసుపత్రి ఉల్లంఘించడంతో డాక్టర్ అగర్వాల్ ఆ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఇది కాస్తా ఇరు వర్గాల మధ్య విభేదాలకు దారితీసింది. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రికి రూ.16.43 కోట్లు చెల్లించాలని ఇందౌర్ ఆసుపత్రిని కోర్టు ఆదేశించింది.
ఈ వివాదం సమయంలో.. మయాంక్ తివారీ నుంచి అగర్వాల్ ఆసుపత్రి ప్రమోటర్ అయిన డాక్టర్ అగర్వాల్‌కు వరుస మొబైల్ సందేశాలు వచ్చాయి. ఆ సొమ్మును ఇక మర్చిపోయి ఆ ఆసుపత్రితో పరిష్కారం కుదుర్చుకోవాలంటూ అందులో తివారీ బెదిరించాడు. ఈ సందర్భంగా తాను పీఎంవోలో ఉన్నతాధికారినంటూ పేర్కొన్నాడు. ఈ విషయం పీఎంవో కార్యాలయం దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరింది. ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
కాగా.. గుజరాత్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ గతంలోనూ తాను పీఎంవో ఉన్నతాధికారినంటూ దిల్లీలోని ఓ స్కూల్ ట్రస్టీని మోసగించాడు. ఈ ఏడాది జూన్‌లో ఆ స్కూల్ నుంచి రెండు అడ్మిషన్లు తీసుకున్నాడు. ఆ కేసులో దిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.