PM Modi – గాజా ఆసుపత్రి ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

ఇజ్రాయెల్-హమాస్ (Israel Hamas Conflict) యుద్ధం వేళ.. గాజా (Gaza)లోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
‘‘గాజాలోని అల్ అహ్లి ఆసుపత్రిలో పెను ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుత ఘర్షణల్లో (ఇజ్రాయెల్-హమాస్ పోరును ఉద్దేశిస్తూ) పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన, ఆందోళనకర అంశం. ఇందుకు కారకులకు శిక్ష పడాలి’’ అని మోదీ (PM Modi) విచారం వ్యక్తం చేశారు.
ఈ ఆసుపత్రిలో మంగళవారం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 500 మంది మరణించినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపించింది. దీన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తీవ్రంగా ఖండించింది. పీఐజే ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ గురి తప్పి ఆసుపత్రిపై పడిందని పేర్కొంటూ వీడియోను విడుదల చేసింది. ఈ దాడిని పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.