Plastic waste gets a new look… – ప్లాస్టిక్ వ్యర్థాలకు కొత్త రూపు…

ఆ ఇంటి ప్రాంగణంలోకి వెళ్తే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, పనికిరాని అల్యూమినియం పాత్రలు, పగిలిపోయిన గాజు సీసాలు, సిరామిక్ పాత్రలు, అరిగిపోయిన టైర్లు, పీవీసీ పైపుల ముక్కలు.. ఇలా నిరుపయోగమైన ఎన్నో వస్తువులు కనిపిస్తాయి. కానీ వాటిని వివిధ రూపాల్లో అందమైన పాత్రల్లా తీర్చిదిద్ది, వాటిలో మట్టివేసి మొక్కలను పెంచుతున్న తీరు చూస్తే అబ్బురపడాల్సిందే. దీని వెనుక చంద్రన్ అనే వ్యక్తి అభిరుచి, పర్యావరణ స్పృహ ఉన్నాయి. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని అంబల్లూర్ గ్రామానికి చెందిన చంద్రన్.. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సమర్థంగా పునర్వినియోగించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇరుగు పొరుగు ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న వస్తువులను సేకరించి వాటికి కొత్తరూపునిచ్చారు. కుండీల్లా తయారు చేసి వాటిలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. నీటి సరఫరా, ఇతర అవసరాలకూ వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. ఏడేళ్ల క్రితం చంద్రన్ వేసిన బీజం ఇప్పుడు ఓ అందమైన ఉద్యానంగా ఎదిగింది. ఇక్కడ పెరిగిన మొక్కలను చూస్తుంటే ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతోందని చెప్పారు. ప్రస్తుతం చంద్రన్ ఇంటి ప్రాంగణమంతా.. మొక్కలు, పూల అందాలతో కళకళలాడుతోంది.