Pakistan is looking to create havoc in India – భారత్‌లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్న పాక్

భారత్ (India)లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్న దాయాది పాక్ (Pakistan) కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-Occupied Kashmir)లోని శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులకు పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ అధునాతన చైనా ఆయుధాల (Chinese weapons)ను అందిస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
పిస్తోళ్లు, గ్రనేడ్లు, నైట్ విజన్ పరికరాలు తదితర ఆయుధాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీటిని చైనీస్ డ్రోన్ల సాయంతో పీవోకే (POK)లోకి తరలిస్తున్నట్లు సమాచారం. అంతేగాక, భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులకు డిజిటల్ మ్యాప్ షీట్లు, నేవిగేషన్ సిస్టమ్స్‌ను కూడా అందిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందిందట. ఇక, పీవోకేలో ఉన్న ఉగ్రవాదుల రహస్య సంభాషణలు.. భారత నిఘా ఏజెన్సీలకు చిక్కకుండా అత్యాధునిక ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను కూడా ముష్కరులకు అందజేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ సమాచారంపై నిఘా వర్గాలు దర్యాప్తు సంస్థలను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దాయాది ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోందని గతంలోనూ నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా బలగాలు.. నియంత్రణ రేఖను దాటుకుని దేశంలోకి ప్రవేశించేందుకు ముష్కరులు చేసే యత్నాలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో హతమయ్యాడు. అయితే, ఈ ఘటనకు ప్రతీకారంగా.. లష్కరే అనుబంధ సంస్థ ఉగ్రవాదులు అనంత్‌నాగ్‌లో రెచ్చిపోయారు. ముష్కరులు జరిపిన దాడిలో ఇద్దరు సైనికాధికారులు, ఓ డీఎస్పీ అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే అనంత్‌నాగ్‌లో ముష్కరుల వేట కొనసాగుతోంది.