Opposition Was Furious – ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి..

జమ్మూకశ్మీరులో సైనికులు అమరులైన రోజు.. భాజపా తమ కేంద్ర కార్యాలయంలో జీ20 సదస్సు విజయోత్సవాలు జరుపుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఎంతటి దుర్ఘటన జరిగినా.. ప్రధాని ప్రశంసలు అందుకోవడం మానరని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ‘‘మృతి చెందిన వారి చిన్నారుల చిత్రాలను చూస్తుంటే నా హృదయం బద్దలైపోతోంది. ఇక్కడ మాత్రం సంబరాలు ఆగలేదు? పుల్వామాలో 40 మంది వీరులు ప్రాణాలు కోల్పోయినా.. మోదీ షూటింగ్ కార్యక్రమాన్ని ఆపలేదు. ఇది ఊహించలేని క్రూరత్వం’’ అని కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో రక్తపాతం నశించి, శాంతి నెలకొనాలంటే భారత్-పాకిస్థాన్ చర్చలు జరపడం తప్పనిసరని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌పై భాజపా ధ్వజమెత్తింది. ప్రతి సంఘటన నుంచి రాజకీయ లబ్ధి పొందడమే విపక్షాలకు అలవాటైపోయిందని విమర్శించింది. భద్రతా సిబ్బంది మృతిపై దేశమంతా విషాదంలో ఉంటే.. కాంగ్రెస్ కనీసం కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించలేదని కేంద్రమంత్రి వీకే సింగ్ ఆక్షేపించారు. కాగా, పాకిస్థాన్‌కు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గురువారం జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జమ్మూకశ్మీరులోని ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న శక్తులపై భారీ ఆపరేషన్ చేపట్టాలని పనూన్ కశ్మీర్, ఏక్ సనాతమ్ భారత దళ్ (ఈఎస్‌బీడీ) డిమాండ్ చేశాయి.