Old Parliament as Samvidhan Sadan – సంవిధాన్ సదన్‌గా పాత పార్లమెంటు

రాజ్యాంగ పరిషత్తు సమావేశాల నుంచి ఎన్నో ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం ఇకపై ‘సంవిధాన్ సదన్’గా మిగిలిపోనుంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధికారిక ప్రకటన వెలువరించారు. (రాజ్యాంగాన్ని హిందీలో సంవిధాన్ అని అంటారు.) 1927లో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ భవనంలో ఎంతోమంది దిగ్గజ నేతల గళాలు ప్రతిధ్వనించాయి. మనల్ని మనం పాలించుకునే హక్కు కోసం పోరాడడం నుంచి స్వాతంత్య్రం సిద్ధించినరోజు వరకు ఎన్నో పరిణామాలను చూడడం ఒక ఎత్తయితే, 1947 తర్వాత దేశాన్ని ఏలినవారి వాక్పటిమ మరో ఎత్తు. దేశ చరిత్రతో రమారమి శతాబ్దకాల అనుబంధం ఈ భవనానికి ఉంది. రాజ్యాంగ రూపకల్పనలో పోటాపోటీగా చర్చలు.. మహాత్మాగాంధీ ఇక లేరనే ప్రకటన వెలువడినప్పుడు బరువెక్కిన సభ్యుల గుండెలు.. మొట్టమొదటి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ హృదయాంతరాళాల్లో నుంచి వచ్చిన మాటలు.. బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ సైనిక దళాలు లొంగిపోయాయంటూ ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ చేసిన ప్రకటన.. వీటన్నింటికీ పార్లమెంటు పాత భవనమే వేదిక.
ఒక్కొక్కరిది ఒక్కో తీరు
నెహ్రూ మొదలుకొని మోదీ వరకు ప్రధానుల ప్రసంగాలు, హావభావాలు ప్రత్యేకం. హృదయాన్ని హత్తుకునేలా ప్రసంగించే నెహ్రూ, నెమ్మదిగానైనా దృఢ చిత్తంతో మాట్లాడే లాల్ బహదూర్ శాస్త్రి, వాక్పటిమతో ఆకట్టుకున్న ఇందిరాగాంధీ, కవితాత్మకంగా అనర్గళంగా మాట్లాడే వాజ్‌పేయీ, శక్తిమంతమైన మాటల ప్రవాహంతో సమ్మోహితుల్ని చేసే మోదీ.. ఇలా ఎందరో నేతల ప్రసంగాలు ప్రతిధ్వనించిన భవనంగా పాత ప్రాంగణం నిలిచిపోనుంది. సందర్శకుల గ్యాలరీ నుంచి అసెంబ్లీ ఛాంబర్‌లోకి విప్లవవీరుడు భగత్‌సింగ్ బాంబులు విసరడాన్ని ఈ చారిత్రక కట్టడం చూసింది. స్వాతంత్య్రం లభిస్తున్న ఘడియల్లో రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశం, ఇందికాగాంధీ అత్యయిక పరిస్థితి విధించిన తరుణం, దానిపై దిగ్గజ నేతల నిరసనలు.. ఇలాంటి ఎన్నో పరిణామాలు ఈ ప్రాంగణంలోనే చోటు చేసుకున్నాయి.