New Parliament Building – నూతన పార్లమెంటు భవనం

నూతన పార్లమెంటు భవనం (New Parliament Building)లో సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మంగళవారం నుంచి నూతన భవనంలోనే కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ సభ్యులు తొలిసారి నూతన భవనంలో అడుగుపెట్టనున్నారు. ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా సభికులకు కేంద్రం ప్రత్యేక కానుక (Hamper)లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం అందివ్వనుంది. ఆ బ్యాగులపై ఎంపీల పేర్లు రాసి ఉన్నాయి. ప్రధాని మోదీ సైతం పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిని ఎంపీలు అనుసరించనున్నారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల మొదటి రోజు పాత పార్లమెంటు భవనంలోనే జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. ఈ భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుంది. భారత్ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి. ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయి’ అని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో ఏ కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.