Kurmi community – కుర్మీ సంఘాల ఆందోళన

ఎస్టీ హోదా కోసం కుర్మీ వర్గీయులు చేపట్టిన ఆందోళన కారణంగా ఆగ్నేయ రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో బుధవారం పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. పట్నా – రాంచీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్, హావ్‌డా – ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్ తదితరాలను దారి మళ్లించారు. రద్దయినవాటిలో హావ్‌డా- ముంబయి గీతాంజలి ఎక్స్‌ప్రెస్, హటియా- ఖరగ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ వంటివి ఉన్నాయి. ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో రైళ్లను అడ్డుకుంటామని కుర్మీ సమాజం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకొన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఏడు రైళ్లు రద్దు కాగా, తొమ్మిదింటిని దారి మళ్లించినట్లు ఆగ్నేయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. తూర్పు కోస్తా రైల్వే విడుదల చేసిన ప్రకటనలో భువనేశ్వర్ – న్యూదిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల గమనంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కుర్మీ ఆదివాసీ సమాజ్ తన ఆందోళనను మంగళవారమే విరమించుకున్నప్పటికీ ఝార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.