Lottery : లాటరీ అదృష్టం

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ(Lottery) టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు. అబోహర్ పట్టణానికి చెందిన రమేశ్, కుకీ అనే స్నేహితులు గత కొన్నేళ్లుగా కలిసి లాటరీ టికెట్లు కొంటున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.100 టికెట్లు రెండు సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి విడుదలైన లాటరీ ఫలితాల్లో.. అందులో ఓ టికెటుకు రూ.కోటిన్నర బహుమతి తగిలింది. సోమవారం ఘంటాఘర్ చౌరస్తాలోని జ్ఞాన్‌చంద్ లాటరీ విక్రయకేంద్రం వద్దకు ఈ మిత్రులిద్దరూ బ్యాండుమేళంతో వచ్చారు. బ్యాండు దరువుకు నృత్యం చేస్తూ మిఠాయిలు పంచి కోలాహలం సృష్టించారు. లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని రమేశ్, కుకీ తెలిపారు.