Lok Sabha – లాగిన్ వివరాలను వ్యాపారవేత్తకు అందించారు

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ఆదివారం సంచలన ఆరోపణలు గుప్పించిన భాజపా ఎంపీ నిషికాంత్ దుబే తాజాగా తన స్వరం మరింత పెంచారు! మొయిత్రా లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ వివరాలను (క్రెడెన్షియల్స్) ఓ వ్యాపారవేత్తకు అందజేశారని సోమవారం ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపించాల్సిందిగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ‘‘లోక్‌సభ వెబ్సైట్లో తన లాగిన్ వివరాలను ఎంపీ మొయిత్రా.. వ్యాపారవేత్త హీరానందానీ, ఆయన రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు ఇచ్చినట్లు తెలిసింది. దానిపై దర్యాప్తు చేపట్టండి. ఈ ఆరోపణలు నిజమని తేలితే.. ఇది అత్యంత తీవ్రమైన నేరం అవుతుంది. అది దేశ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే. ఆమె లాగిన్‌కు సంబంధించి ఐపీ అడ్రస్‌లను చెక్ చేయాలి’’ అని లేఖలో దుబే డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీల పార్లమెంటరీ పనులను పీఏలు, అసిస్టెంట్లు, ఇంటర్న్లతోపాటు పెద్ద బృందాలు చూసుకుంటాయని గుర్తుచేశారు. మరోవైపు- పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ స్పందించింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొన్ని గ్రూప్‌లు, కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ మొయిత్రాను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. మరోవైపు తనపై ఆరోపణల వ్యవహారంలో దుబేతో పాటు ఓ న్యాయవాదికి మొయిత్రా లీగల్ నోటీసులు పంపించారు.