Kerala : Preparation Of ‘Nipah’ Drug – కేరళ: ‘నిపా’ మందు తయారీ

నిఫా వైరస్ బాధితులకు చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం రాష్ట్రానికి చేరుకుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిఫా వైరస్‌ను తగ్గిస్తుందని నిర్ధారణ కాకపోయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో అత్యుత్తమమైందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో గురువారం ఉదయం సమావేశానంతరం సాయంత్రానికి మందు రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. తదుపరి చర్యలపై నిపుణుల కమిటీ సూచనలిస్తుందని వెల్లడించారు. ఎం102.4 మోనోక్లోనల్ యాంటీబాడీ మందును ప్రయోగాత్మక పరిశీలన కోసం 2018లో కేంద్రం దిగుమతి చేసుకుంది. అయితే అప్పటికే కేరళలో నిఫా వైరస్ తగ్గిపోవడంతో వాడలేదు. మళ్లీ ఇది విజృంభించడంతో ఇప్పుడు వాడాలని నిర్ణయించారు. ఇటీవల కోజికోడ్ జిల్లాలో నిఫా తీవ్రత కనిపించిన సంగతి తెలిసిందే. మెదడును దెబ్బతీసే ఈ వైరస్‌వల్ల ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి కూడా ఇది సోకింది. ఇందులో 24ఏళ్ల ఆరోగ్య కార్యకర్త ఉన్నారు. ఈ ముగ్గురిలో 9ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో కోజికోడ్‌లో గురు, శుక్రవారాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విశ్వవిద్యాలయ పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ గీత తెలిపారు.