justice – న్యాయమే లక్ష్యం.

వలస పాలన నాటి న్యాయవ్యవస్థకు చరమ గీతం పలికి, భారత మట్టి వాసన గుభాళించేలా కొత్త నేర చట్టాలను రూపొందించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పౌరుల రాజ్యాంగ, మానవ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే వీటి లక్ష్యమని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షలు వేయడానికి రూపొందించారని.. కానీ మేం న్యాయం అందివ్వడానికి కొత్త సంహితలను తెచ్చామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును ఉద్దేశించి ఆదివారం అమిత్ షా ప్రసంగించారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్య చట్టం స్థానంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ బిల్లులతో దేశ న్యాయవ్యవస్థలో వలస పాలన ముద్రలు పూర్తిగా తొలగిపోనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కె.పరాశరన్, ఫాలి.ఎస్.నారిమన్, కె.కె.వేణుగోపాల్‌లను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మానించింది. సీనియర్ న్యాయవాదులు సోలి సొరాబ్జీ, రామ్ జెఠ్మలానీ (మరణానంతరం)లకు అవార్డులు ప్రకటించింది. వాటిని వారి కుటుంబ సభ్యులకు అమిత్ షా అందజేశారు.