ISRO – శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2035 కల్లా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవడం, 2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపడం వంటి సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకొని కృషిచేయాలని సూచించారు. మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో తొలిసారిగా తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్’ మిషన్‌లో భాగంగా తొలి క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను ఈ నెల 21న పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో గగన్‌యాన్ సన్నద్ధతపై ప్రధాని నేతృత్వంలో మంగళవారం దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలపై ఈ సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. శుక్రగ్రహంపైకి ఆర్బిటర్‌ను, అంగారకుడిపైకి ల్యాండర్‌ను పంపే ప్రయోగాలపై దృష్టిసారించాలన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది.