irregularities in mid-day meal scheme – మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్థాన్(Rajasthan)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రెడ్ డైరీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి రాజేందర్ సింగ్ యాదవ్(Rajasthan Minister Rajendra Yadav) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఈ తనిఖీలు జరుగుతున్నాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
రాజేందర్ సింగ్ యాదవ్.. జైపుర్‌లోని కోట్‌పుత్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కేబినెట్‌లో నంబర్ టుగా కొనసాగుతున్నారు. ఆయన విద్య, న్యాయం వంటి పలు శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈడీతో పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సుమారు 10 ప్రాంతాల్లో సోదాల్లో పాల్గొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో యాదవ్ ఇంటిముందు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి ఉన్నాయని, ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారని సమాచారం. అయితే తనిఖీలపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు.