India – ఫేస్‌బుక్, గూగుల్ సీఈవోలకు లేఖ..

భారత్‌లో ఇది ఎన్నికల తరుణమైనందున మత విద్వేషాలకు ప్రోత్సాహం ఇవ్వకుండా, ప్రజాస్వామ్య పోరులో తటస్థ వైఖరిని పాటించాలని కోరుతూ ‘మెటా’ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పించాయ్‌లకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి లేఖలు రాసింది. సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ భారత్‌లో అధికారపక్షమైన భాజపాకు, నరేంద్ర మోదీ పాలనకు మద్దతుగా పక్షపాతం చూపుతున్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ లేఖలు తెర మీదకు వచ్చాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ లేఖను జుకెర్‌బర్గ్‌కు షేర్ చేస్తూ.. భారత్‌లో సామాజిక అసమానతలను ప్రోత్సహించడంలో, మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో మెటాను దోషిగా పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చిన పరిశోధన కథనాన్ని ఉటంకించారు. ఇదే లేఖను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు కూడా షేర్ చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని వారికి పరిచయం చేస్తూ 28 రాజకీయ పార్టీల కలయిక అయిన తాము 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి, భారత్‌లోని సగం మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ, ప్రతిపక్ష నేతల అణచివేతకు కొన్ని సామాజిక మాధ్యమ వేదికలు పాల్పడుతున్నట్లుగా తమ వద్ద సమాచారం ఉందని ఏఐసీసీ కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేరుతో పంపిన లేఖలో తెలిపారు. ఒక ప్రయివేటు విదేశీ కంపెనీ ఈ విధంగా భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడాన్ని తాము తేలిగ్గా తీసుకోబోమని లేఖలో హెచ్చరించారు. ఈ విషయాలను తీవ్రంగా పరిగణించి ‘మెటా’ తక్షణం తటస్థ వైఖరికి మారాలని కోరుకొంటున్నట్లు వెల్లడించారు. భారత్‌లో సామాజిక అశాంతి రేపడానికి, ప్రజాస్వామ్య ఆదర్శాల వక్రీకరణకు మీ వేదిక ఉపయోగపడకుండా చూడాలంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు రాసిన లేఖలో ‘ఇండియా’ నేతలు కోరారు.