IIIT Delhi – వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేసింది.

చిన్న పిల్లల వైద్యులకు శిక్షణనిచ్చేందుకు దిల్లీ ఐఐఐటీ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ విద్యా సంస్థకు చెందిన మెడికల్ రోబోటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలోని మావెరిక్ కంపెనీ సిలికాన్‌తో నవజాత శిశువు ‘లూసీ’ బొమ్మను రూపొందించింది. ఇప్పటి వరకు వైద్యులు, వైద్య విద్యార్థులకు ప్లాస్టిక్ బొమ్మలపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు సిలికాన్ సిమ్యులేటర్ బేబీ అయిన లూసీని ఉపయోగిస్తారు. దీని ద్వారా అన్ని రకాల వైద్య చికిత్సలను సులభంగా అభ్యసించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెడికల్ రోబోటిక్స్ సెంటర్.. సిలికాన్‌తో 2,500 గ్రాముల లూసీ బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు శ్వాసతో పాటు గుండె స్పందనలూ ఉన్నాయి. సిలికాన్ సిమ్యులేషన్ ద్వారా వైద్య విద్యను అభ్యసించే తొలి దేశంగా భారత్ అవతరించనుందని మావెరిక్ కంపెనీకి చెందిన డాక్టర్ రితేజ్ కుమార్ తెలిపారు. సిలికాన్‌తో తమ కంపెనీ.. ఆస్కల్టేషన్ టాస్క్ ట్రైనర్‌ని అభివృద్ధి చేసిందని మావెరిక్ డైరెక్టర్ కనికా చాహల్ తెలిపారు. ‘దీని ద్వారా పిల్లలు, పెద్దలలో గుండె, ఊపిరితిత్తులు, ఉదర సంబంధిత వ్యాధులను వైద్యులు బాగా అర్థం చేసుకోగలుగుతారు’ అని చాహల్ వివరించారు.