#National News

Human Trafficking : ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు

మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా దాడులు చేసింది. బుధవారం ఎనిమిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ దాడులు చేపట్టినట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్న మయన్మార్‌కు చెందిన వ్యక్తిని జమ్మూలో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, త్రిపుర, రాజస్థాన్‌, హరియాణాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌, పుదుచ్చేరిలలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించిన సోదాల్లో మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లిం జాఫర్‌ అలామ్‌ను బథిండి ప్రాంతంలో బుధవారం ఉదయం రెండు గంటల సమయంలో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు ఉన్న మరో నిందితుడు పరారైనట్లు తెలిపారు. మయన్మార్‌ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టారు. పాస్‌పోర్టు చట్టాలను అతిక్రమించడం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నమోదైన కేసుల విచారణలో భాగంగా ఈ దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. గత నెలలో శ్రీలంకకు చెందిన పలువురిని తమిళనాడు మీదుగా బెంగళూరు, మంగళూరుకు అక్రమంగా తరలించిన కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *