Guinness Record : ప్లేయింగ్ కార్డ్స్‌తో మేడలు కట్టి..

ప్లేయింగ్ కార్డ్స్‌తో ఓ చిన్న నిర్మాణం చేయడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి కార్డులతో ఏకంగా నాలుగు ఎతైన నిర్మాణాలు చేపట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record)లోకి ఎక్కాడు ఓ బాలుడు.
కోల్‌కతా (Kolkata)కు చెందిన 15 ఏళ్ల అర్నవ్ దగా (Arnav Daga) ప్లేయింగ్ కార్డ్స్‌తో రికార్డు సృష్టించాడు. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షాహిద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, ఎస్‌టీ. పాల్ కేథడ్రల్‌లను వీటితో నిర్మించాడు. వీటిని నిర్మించేందుకు సుమారు 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్ ఉపయోగించాడు. 41 రోజుల్లో ఈ నాలుగు నిర్మాణాలను పూర్తి చేశాడు.
మొత్తం ప్రాజెక్ట్ పొడవు 40 అడుగులు, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు.. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్స్ నిర్మాణంగా రికార్డుకెక్కింది. దీంతో అర్నవ్ గతంలో బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజాగా ప్రకటించింది.
‘‘ఎనిమిదేళ్ల వయసులోనే ప్లేయింగ్ కార్డ్స్‌తో చిన్న చిన్న మేడలు కట్టడం మొదలుపెట్టాను. చదువుతో పాటు నా లక్ష్యన్ని సాధించేందుకు ఎంతో ఇబ్బంది పడ్డా. కానీ లాక్‌డౌన్ సమయంలో దీనిపై మరింత కసరత్తు చేశా. దీంతో మూడేళ్లు శ్రమించి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాధించా’’ అని అర్నవ్ తెలిపాడు.