Ganapati Bappa Morea.. – గణపతి బప్పా మోరియా..

దేశమంతటా గణేశ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో వెలసిన ప్రఖ్యాత దగడూసేఠ్ గణేశుని మండపంలో సంబరాలు ఘనంగా జరిగాయి. చవితిరోజు నుంచే ఘనంగా వేడుకలు జరగ్గా.. బుధవారం ఉదయం దాదాపు 36,000 మంది మహిళలు సామూహిక భజనలు చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగింది. రుషి పంచమిలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న భక్తులు గణేశుని ముందు ‘అథర్వశీర్ష’ పారాయణం చేశారు. కొంతమంది రష్యన్లు, థాయిలాండ్ వాసులు కూడా ఇందులో పాల్గొని సందడి చేశారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిర నమూనాతో మండపాన్ని అలంకరించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. గత 36 ఏళ్లుగా దగడూసేఠ్ వినాయకుని చవితి వేడుకల్లో అథర్వశీర్ష పారాయణం చేస్తున్నామంటూ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.