Farmers and fans gathered to oppose Chandrababu’s arrest – చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తరలివచ్చిన రైతన్నలు, అభిమానులు

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో తెలుగు ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలసంఖ్యలో కర్షకలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ పార్టీల స్థానిక నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాలో తుగ్లక్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటానికి సింధనూరు తెలుగు ప్రజలు రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకుని మంగళవారం ఉదయం ఒక్కసారిగా క్లబ్ కాకతీయకు ప్రదర్శనగా చేరుకున్నారు. అక్కడి నుంచి వారు భారీ సంఖ్యలో ప్రభుత్వ క్రీడా మైదానానికి తరలి వెళ్లారు. మాజీ ఎంపీ కె.విరుపాక్షప్ప (భాజపా), మాజీ మంత్రి నాడగౌడ(జేడీఎస్), భాజపా సీనియర్ నాయకులు కె.కరియప్ప, కొల్లా శేషగిరిరావు, విరుపాపుర అమరేగౌడ, కాంగ్రెస్ నాయకులు బాబూగౌడ బాదర్లి, శ్రీదేవి శ్రీనివాస్ స్టేడియం వద్దే బూబు అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నడూ బయటకు రాని తెలుగు వనితలు తొలిసారిగా వందలసంఖ్యలో ఈ పోరాటంలో పాల్గొని తామంతా చంద్రబాబుకు బాసటగా ఉంటామనే ప్లకార్డులు పట్టుకుని నడిచారు.