Gujarat – బిల్కిస్ బానోపై అత్యాచారం

గుజరాత్ అల్లర్ల(2002) సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులు 11 మంది జైలు నుంచి ముందుగా విడుదల కావడంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ‘శిక్షా కాలం ముగియటానికి ముందే తమను విడుదల చేయాలని కోరే ప్రాథమిక హక్కు దోషులకు ఉంటుందా? నిబంధనలను పాటించిన తర్వాతే వారికి రెమిషన్ మంజూరైందని చెప్పగలిగే వారెవరు?’ అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ సందర్భంగా ప్రశ్నించింది. దీనికి దోషుల తరఫు న్యాయవాది సమాధానమిస్తూ…‘దోషులకు అటువంటి ప్రాథమిక హక్కు ఉండద’ని తెలిపారు. తమ హక్కులకు భంగం కలిగిందని రాజ్యాంగ అధికరణం 32 ప్రకారం వారు నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించలేరని పేర్కొన్నారు. రెమిషన్‌ను సవాల్ చేసే చట్టపరమైన హక్కులు బాధితులకు ఉంటాయన్నారు. దోషులు 15ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని గుర్తు చేశారు. నేరగాళ్లను సంస్కరించాలన్నదే క్రిమినల్ చట్టాల ప్రధాన లక్ష్యం కనుక నేర తీవ్రతను ఈ దశలో చూడరాదని కోరారు. ఖైదీల ప్రవర్తన ఆధారంగా వారి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని వివరించారు. ఈ కేసులో దోషుల తరఫు న్యాయవాదుల వాదనలు బుధవారంతో ముగిశాయి. బిల్కిస్ బానో వాదనలను ఆమె తరఫు న్యాయవాదులు అక్టోబరు 4న వినిపించనున్నారు.